Kavana Sarma Kaburlu

All Rights Reserved

నేను రాజకీయ భావాల ప్రవాహం లో నా ప్రయాణం

leave a comment »

నేను రాజకీయ భావాల ప్రవాహం లో నా ప్రయాణం : 3 వ విడత ,సతీశ్ ధవన్ Indian Institute of Science కి డైరెక్టర్ గా ఉన్న కాలం 1962-1981 ; మొదటి భాగం1972 వరకు నేను IISc లో 1962 నవంబర్ లో Ph.D. చేసే నిమిత్తం చేరాను. అప్పుడే సతీశ్ ధవన్ డైరెక్టర్ గా బాధ్యత తీసుకున్నారు . ఇండియా యొక్క సైన్స్ సాంకేతిక ప్రగతి చరిత్రలో మా సంస్థకి పెద్ద పాత్రే ఉంది.
ఆ సంస్థకి అంతకు పూర్వం నోబెల్ బహుమతి పొందిన C V Raman, director గా ఉండి తన తరవాత కళ్లేలు తన శిష్యుడైన సూరి భగవంతానికి ఇచ్చారు. ఆ కాలం లో రీసెర్చ్ లో ఒక నెమ్మది తనం పరుచుకు ఉండేది .
అప్పుడు 42 ఏళ్ల కుర్రవాడైన ధవన్ కి పగ్గాలు తాతా ( భారత రత్న JRD టాటా ) వంశస్థుడు అప్పచెప్పారు .
ధవన్ కాలం లో మా సంస్థ కొత్త దారులు తొక్కింది కొత్త వేగం అందుకుంది. దానికి కొంతకారణం ఇందిరా గాంధీ . యథా రాజా తథా ప్రజా . దేశం లో రాజకీయ ప్రభావాలు మా సంస్థ మీద దాని వల్ల మా మీద పడకుండా ఉండవు కదా . ఆ కథే ఇక్కడ నేను చెప్పబోతున్నది .
జనకుడి రాజ్యం లో సామాన్యులు కూడా గొప్ప వేదాంతులైనట్టు , మా సంస్థలో నా లాటి సామాన్యుడు కూడా బయటి ప్రపంచం లో మేధావి అన్న పేరు కొట్టేస్తాడు. ఇక్కడి scientist లని ఏబీసీడీ వర్గాలుగా విభజిస్తే నేను బీ వర్గం లో పడతానేమో .ఏ ఖచ్చితం గా కాను . నా జీవితమంతా నా పాటి, నాకన్నా, తెలివైన వారి తో రాజకీయ చదరంగం ఆడాల్సి వచ్చింది.
ఇక్కడ వారి గురించి 1972/73 వ్రాసిన బుర్ర కథలో ఇలా వర్ణించాను ‘
" చేసే పనులకు నప్పే థీరీలు చెప్పే చెప్పుదురు భళాభళీ " వారి స్వలాభం ఎటు ఉందొ అటు ముక్కు తిప్పుకుని ముక్కు సూటిగా వెళ్లే తత్వం వారిది. ఇంతకు మించి వివరించటం అనవసరం .
ధవన్ డైరెక్టర్ అయ్యే నాటికి మొత్తం ఇన్సిట్యూట్ లో 9 మంది ప్రొఫెస్సర్లు తమకింద ఉన్న 100 మంది మేష్టర్లకి 1000 మంది స్టూడెంట్స్ కి భయ భక్తులు కలిగించి ఎవరి శాఖ ని వారు గొప్ప క్రమ శిక్షణ తో పాలించుకుంటూ ఉన్నారు.
అందులో కొందరికి ఈ కుర్ర ప్రభువు నచ్చక కోర్టుని ఆశ్రయించి దెబ్బ తిన్నారు .

అప్పటి నుంచి ధవన్ జైత్ర యాత్ర మొదలైంది . సెనేట్ లో ఈ అనుభవ వృద్ధులకి ముక్కుకి తాడు వేయటం ఎలాగా? అని ఆలోచించిన వాడై ,అంతవరకూ లేని Associate Professor అనే పదవిని సృష్టించి పేర్లు సూచించమని అడిగాడు .తమ పరిజనుల పేర్లు పెద్దలు ఆనందం గా సూచించారు అలా ఒక 33 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లని పైకి నెట్టడం జరిగింది. వాళ్ళు అందరు సెనేట్ సభ్యులయ్యారు. వారు తమ పేర్లు సూచించి పెద్దలకి కాక ధవన్ అనుయాయులవటం తో పెద్దల ఆటలు కట్టుబడ్డాయి. అది రాజకీయం గా ధవన్ వేసిన మొదటి విజయ పాచిక .
ఉద్యోగాలని 5 ఏళ్ల కాంట్రాక్టు ఉద్యోగాలుగా మార్చటం, విద్యార్థుల pre Ph.D. పరీక్షల్లో తాను స్వయంగా పాల్గొనటం తో శాఖల స్వయం ప్రపత్తులు కొంత దెబ్బ తిన్నాయి .ఒక కేంద్రీయ పాలనకు అంకురార్పణ జరిగింది
1965 లో దేశం లో వచ్చిన మార్పులకి అనుగుణం గా ధవన్ మా సంస్థలో faculty విస్తరణ ప్రోగ్రామ్ తలపెట్టి ప్రకటనలు జారీ చేసారు. అప్పుడు మా సంస్థలో Engineering డిపార్ట్మెంట్స్ లో Lecturer ఉద్యోగాలకి ఇప్పటిలాగా Ph.D. కలిగి ఉండాలన్న నియమం లేదు ME ఉండి కొంత Research experience ఉంటె సరిపోయేది . మా deaprtment కి బోలెడన్ని CBIP ప్రాజెక్ట్స్ వాటిలో ఉద్యోగాలు ఉండేవి నా సీనియర్స్ చాలా మంది వాటిలో కుదురుకున్నారు. కానీ ఒక్కడికీ నాకు లాగ పెళ్ళీ పెళ్ళాం , పిల్లలూ అంటూ జంజాటాలు లేవు. శని ఆదివారాల్లో South పెరేడ్ లో సినిమాలనీ అమ్మాయిలనీ చూస్తూ, 3 Aces లో బీరు తాగుతూ రికామీ గ ఉండే వారు .నేనల్లా కాదే ! AU లో లెక్చరర్ గా ఉన్నవాడిని అది వదులుకుని , ఆ వదులుకోక ముండే నాకు ఉద్యోగం ఉన్నద ని నన్ను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కుదుర్చుకుని ,బెంగళూరు రాగానే పెళ్లి చేసుకుని కాపురం పెట్టి ఆలస్యం చేయకుండా ఒక అమ్మాయికి తండ్రయి , మరోసారి మరో సంతానానికి రేపో మాపో అవబో తున్న వాడిని . అందుకని, నేను అప్లై చేయటానికి ,అనుమతి ఇవ్వమని మా ప్రొఫెసర్ని అర్ధించాను .
" ఆఉద్యోగం నీకు ఇవ్వను నీ సీనియర్ కి ఇవ్వలనుకుంటున్నాను " అన్నారాయన.
నేను IIT లో చదివి వచ్చిన వాడిని నా senior ఆయన వద్దే ME చేసిన వాడు ."ఉద్యోగం ఇవ్వకపోతే మానెయ్యండి .అప్లై చేయనివ్వండి " అని బతి మాలాను . మా మేష్టారికి నాకు గృహస్థ స్టేటస్ మీద సానుభూతి ఉంది. ఒకసారి ‘పెళ్లి చేసుకోను’ అంటున్న వాళ్ళ అమ్మాయితో ‘శర్మని చూసి బుద్ధి తెచ్చుకో " అన్నారు. ఆ సానుభూతి కార్డ్ ని తురుఫు ముక్కలా వాడాను . ఆయన అనుమతించారు
నా అ దృష్టం కొద్దీ మా ఇద్దరికీ ధవన్ ఉద్యోగాలు ఇచ్చారు అక్కడ ఫాకల్టీ గా చేరిపోయాను .
"వీడేదో Ph.D. చేసుకుని పోతాడు అనుకుంటే అది చేయకుండానే పాతుకు పోయాడే" అనుకున్నారు మా శాఖ లో పెద్దలు .నేనలా పాతుకు పోవటం వాళ్లకి నచ్చక నన్ను చాలా విధాలా వదుల్చుకుందామని చూసారు
1969 నాటికి నాకు Ph.D. వచ్చేసింది ఈ సారి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి ప్రకటన జారీ అయింది .నా గైడ్ అయిన పెద్దాయన రిటైర్ అయి ,రెండో ఆయన హెడ్ అయ్యారు. నేను ఆయన వద్ద Ph.D. చేయనందుకు ఆయనకీ నాపై గుర్రు ఉండేది .
ఆయన , ఆయన తరవాతి ఆయన, నా మీద ఉన్నవి లేనివి ,కల్పించి ధవన్ కి నూరి పోసారు . ఆ ఇంటర్వ్యూ లో నాకు ప్రమోషన్ రాక రెండో అతనికి వచ్చింది .
నాకు వేడి పుట్టింది. విదేశాలకి అప్లై చేయటం మొదలు పెట్టాను .నాకు నార్వే ఆస్ట్రేలియా లోను అవకాశాలు వచ్చాయి . నేను ఆస్ట్రేలియా కి కుటుంబంతో వెళ్ళటానికి నిశ్చయించుకున్నాను 2 సంవత్సరాలు సెలవు అడిగాను . నన్ను డిపార్ట్మెంట్ resign చేసి పొమ్మంది . ధవన్ కి మొరపెట్టుకున్నాను" నేను అంత పనికి మాలిన వాడిని అయితే రెండు దేశాలు నాకు అవకాశాలు ఇవ్వవు కదా " అని నా పట్ల ఉన్న వివక్ష ఆయనకి వివరించాను . ఆయన నాకు సెలవిచ్చాడు . నేను ఆస్ట్రేలియా లో ఉన్నప్పుడు వచ్చిన మరో ప్రకటనకు నేను దరఖాస్తు పెట్టుకుంటె" శర్మ ఇండియా వచ్చాక చూద్దాము" అంటూ నాకింది అతన్ని నా పైకి ప్రమోట్ చేసింది డిపార్ట్ మెంట్ .
1972 జులై లో మన దేశం తిరిగి వచ్చాను ( సశేషం )

Advertisements

Written by kavanasarma

August 18, 2018 at 3:08 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: