Kavana Sarma Kaburlu – Sarada Anuvadalu

All Rights Reserved

ప్రసంగ వ్యాసం కొనసాగింపు

4 కొత్త పదాలు సృష్టించటం లో గుర్తుంచు కోవలసిన విషయాలు
పదాలు సృష్టించే ముందు ఇతర భాషా పదాలని యథాతథం గా స్వీకరించగలమా అని చూడాలి . ఇప్పటికే తెలుగులో ఉన్న పదాల్లో ఏవైనా ఆ భావాన్ని వ్యక్త పరిచేందుకు అనువుగా ఉన్నాయేమో చూసుకోవాలి .
4.1 భా షా పరిశుద్ధత : ఇతర భాషా పదాలని స్వీకరించటం వలన భాష భ్రష్టు పట్టిపోతుంది అన్న భావం , అంటే భాష యొక్క పరిశుద్ధత దెబ్బతింటుంది అన్న నమ్మకం కొందరికి ఉన్నది . యదార్ధానికి భాషా పరిశుద్ధత అనేది , దాని పదజాలం( Vocabulary ) కి సంబంధించినది కాదని మనం గుర్తుంచుకోవాలి. అన్ని సజీవ భాషలు ,ఇతర భాషా పదాలు స్వీకరించి, సుసంపన్నం అవటం ద్వారానే అవి సజీవంగా ఉంటున్నాయి అని గుర్తు ఉంచు కోవాలి . ఉదాహరణకి ఇంగ్లిష్ .
ఇప్పుడు మనం మృత భాషలు అంటున్నవి కుడా బతికినన్నాళ్ళు అవి మడి కట్టుకు కూర్చోలేదు. ఉదాహరణకి సంస్కృతం లో కూడా ద్రావిడ భాషా కూటమికి చెందిన అక్షరాలు, పదాలు ఉన్నాయి అని విన్నాను . అది, ఎన్నో కొత్త మాటలను స్వయంగా సృష్టించు కుంటూ, పరాయి భాషలనుంచి స్వీకరిస్తూ దాని మూల భాష నుంచి విడిపోయి ఒక అస్తిత్వాన్ని సంపాదించుకున్నది. తెలుగు కుడా కొత్త మాటలను స్వీకరిస్తూ సృష్టిం చుకుంటూ తన ద్రావిడ భాషా మూలాల నుంచి విడిపోయి సంస్కృతమే దాని మూల భాష అని మనం నమ్మే అంతగా సుసంపన్నమై ఉన్నది .
తెలుగుని శు భ్రపరిచేక్రమం లో దానిలో ఉన్న ఇంగ్లిష్ ,ఉర్దూ సంస్కృత, తమిళ, కన్నడ మాటలు తొలగించు కుంటూ పోతే మిగిలే అతి శుద్ధమైన తెలుగు భాష ,మూగ భాష మాత్రమే !
4.2 నుడికారం : తెలుగు అంటే దాని పదజాలం కాదుఅన్నాము కదా మరి తెలుగు అంటే ఏమిటి ? తెలుగు అంటే దాని నుడి కారం .ఆ నుడి కారానికి అనుగుణంగా పదాలు ఏర్పరుచుకోవాలి.వాక్యాలు నిర్మించుకోవాలి . ఉదాహరణకి Computer నే పదానికి తెలుగులో పదం ఏమిటి? Compute అంటే గణించు , లెక్కపెట్టు , కలనము చేయు . కనక, Computer ని తెలుగు లో గణన యంత్రము , కలన యంత్రము ,లెక్కల మర అనవచ్చు. మనకి గిలక పలక అనే మాటలు ఉన్నాయి. ఆ నుడికారం లో గణక , కలక అనవచ్చు కలక అన్నది పలక లాగా వినటానికి సొంపుగా ఉంది కదా ! ఆ మాటనే స్థిరపరుద్దాము
‘కంప్యూటర్’ అంటే లెక్క పెట్టె వాడు అని కుడా అర్ధం ఉంది. అతనిని గణకుడు అనవచ్చు అప్పుడు computress ని ఏమనాలి ? గణిక అంటే వినటానికి ఎబ్బెట్టుగా ఉంది. కనక కలన కలికి లేక ఉత్త కలికి అనవచ్చు .కలికి అంటే స్త్రీ అనే కాక కలనానికి సంబంధించిన స్త్రీ అని స్పురించ వచ్చు అనుకుంటా. మగవాడిని కలకుడు అనవచ్చు . అంటే ఆ పదాలు ఇప్పుడు, కలక , కలకుడు, కలికి గా స్థిరపరిచాము అన్నమాట .ఈ మాటలు వాడగా వాడగా జనాలు అలవాటు పడవచ్చు. లేక ఈ మాటలు జనాలకి నచ్చక మరుగున పడి గణని, గణకుడు ,గణకి లాంటి కొత్త మాటలు వాడుక లోకి రావచ్చు గణకి తెలుగు నుడికారానికి చెందనిది. కాని గణిక అంటే స్త్రీల విషయం లో వేరే అర్ధం వస్తుంది కనక మనం కొంచెం నుడికారాన్ని త్యాగం చేస్తున్నాము అన్నమాట . వాడుకలో పరిపదాలు మారుతూ రావటం కూడా ఒక అనువాయితీయే .
ఇంగ్లిష్ లో కూడా ఈ పరిభాష మారుతూ వచ్చింది
ఉదాహరణ కి ప్రవాహి శాస్త్రం లో Turbulent flow అనే మాటకి మొదట్లో బదులు Eddy flow అని వాడేవారు అంటే సుళ్ళు తిరిగే ప్రవాహం అన్న మాట .మనం ఇప్పుడు దానిని సుడుల ప్రవాహం అనక్కరలేదు .నేరుగా కల్లోల ప్రవాహం అన్న తెలుగు మాటని వాడుక చేయ వచ్చు .
నుడికారం ప్రకారం Newtonian అన్న పదం న్యూటనిక ,Scientific అన్న పదం సైన్సీయ అవుతాయి .స్థిరంగా ఉన్న , చలించే ‘బొందిలు’ (Bodies ) కి వర్తించే శాస్త్రాన్ని ఇంగ్లిష్ లో Mechanics అంటారు .ఈ మాట Machine( యంత్రం ) అనే పదం నుంచి పుట్టినది. కనక దీన్ని యాంత్రిక శాస్త్రం అంటారు తెలుగు లో . యంత్రం నుంచి యాంత్రిక అనే పద సృష్టి , సంస్కృత భాష యొక్క నుడికారం ఆధారంగా జరిగింది. తెలుగుకి తనదే అయిన వ్యాకరణం ఉన్నా , సంస్కృత పదాలని, వ్యాకరణాన్ని, ఎలా ఉంటె అలా స్వీకరిస్తుంది. అదే తెలుగు ప్రత్యేకత .అదే దాని నుడికారం
తెలుగు నుడి కారాన్ని భ్రష్టు పట్టిస్తే ఆ పదాల మనుగడకే ముప్పు కలిగే అవకాశం ఎక్కువ అని అని గుర్తుంచు కోవాలి .
4.3. పదానికి అర్ధం, శాస్త్రం బట్టి, భాష బట్టి, తెలుసుకోవాలి : ఒక పదాన్ని వేరు వేరు శాస్త్రాల్లో వేరు వేరు అర్ధాల్లో వాడటం తరుచుగా చూస్తూ ఉంటాము ఉదాహరణకి ద్రవ్యం అనే మాట ఆర్హిక శాస్త్రం లో Money అనే అర్ధం లో వాడితే భౌతిక శాస్త్రం లో Mass అనే అర్ధం లో వాడుతాం . తర్క శాస్త్రం లో వాడే Elements, రసాయన శాస్త్రం లో వాడే Elements ఒకటే కావు . కనక మనం తెలుగులో మొదటి దానికి భూతాలని , రెండో దానికి మూలకాలని వాడుతాము .అల్లాగే కలక ని కలన యంత్రంగా అర్ధం చేసుకోవాలె కాని కళ్ళకి వచ్చే జబ్బు గా అనుకో రాదు. తర్క శాస్త్రం లో అనుమానం ( Inference ) తెలుగు లోని అనుమానం( Doubt) ఒకటి కాదు .తెలుగులో గ్రహం అ నే మాటకి ఇంగ్లిష్ పదం Planet కాదు. కొన్ని తప్పుడు అన్వయాల వల్ల సామాన్యులలో ఉన్న గందర గోళం , శాస్త్రాలని అర్ధం చేసుకోవటం లో సామాన్యులు తొలగించు కోవాల్సిన అవసరం ఉంది.
5.కొత్త పదాల సృష్టి
కొత్త పదాలు సృష్టించే ముందు చేయాలిసిన పనులు
5.1 తెలుగులో ఉన్న పదాలని జల్లెడ పట్టాలి : ఇంగ్లిష్ పదాలకి సమానార్ధక పదాలు ఒకప్పుడు పామర జనాలకి తెలిసినంతగా మన లాంటి పండితులకి తెలియవు .దీనికి ఉదాహరణ తెలుగు లో అతి ప్రచారానికి వచ్చిన మాట ‘తవ్వోడ ‘ దీన్ని Dredger కి బదులుగా పామర జనాలు వాడుతున్నట్టు ఒక పెద్దాయన గుర్తించాడు .దానికి చాల ప్రచారం జరిగింది. ఇటువంటి మాటలకోసం వెతకాలి .
బండి ( Vehicle) ,బొంది (Body), వడి ( Speed ), ఇరుసు ( Axle ) , పూత ( Coat)
ఈ మధ్య సంజనపద్మం అనే చిరుప్రాయపు పిల్ల తన కథలో Driver అన్న మాటకి తమ ప్రాంతం లో వాడుకలో ఉన్న పదం ‘తోలరి ‘ వాడింది. అది మంచి పదం . చోదకుడు అనే పదం వాడుకలో ఉన్నా ఎడ్ల బండిని తోలరి తోలుతాడు. అది నుడికారం , చోదకుడు చోదుతాడు అంటే అది వినటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. ఎందుకంటే అది తెలుగు నుడుకారం కాదు.
ఇల్లాగే మనం తెలుగు క్రియా పదాలను మార్చి శాస్త్రాలకి అవసరమైన నామవాచకాలని చేసుకోవచ్చు
ఉదాహరణలు : Tension , Drag = లాగుడు , Pull = పీకుడు , Thrust = తోపుడు Compression = నొక్కుడు, Elongation = సాగుడు , Buoyancy = తేల్చుడు, pressure =ఒత్తిడి , నీటి పారుదల కి సంబంధించిన కొన్ని పదాలు :Dam =అడ్డకట్ట Head works = తల పనులు Lock= నీటి కట్టడి
5.2 వాడుకలో ఉన్న పర భాషా పదాల స్వీకరణ : బాగా వాడుకలో ఉన్న పరభాషా పదాలని స్వీకరించటం అవమానం కాదు .అటువంటి కొన్ని పదాలకి ఉదాహరణలు ; రోడ్డు,రైలు, కారు, వకాల్తా , కోర్టు, తర్జుమా , అసలు ( Principal),రేడియో , టీవి, విద్యుత్ , ధన ఋణ విద్యుత్ లు , కణం , శకలం , రేణువు, అణువు ,తేజస్ , లేపనం.

Written by kavanasarma

February 15, 2018 at 10:34 am

Posted in Uncategorized

%d bloggers like this: