Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

నా ప్రసంగా వ్యాసం కొనసాగింపు

6 కొత్త పదాలని ఎలా సృష్టించాలి ?
6. 1 సంస్కృతం దాని వ్యాకరణం ద్వారా : తెలుగులో 50000 పైనే సంస్కృత పదాలున్నాయి అంటారు. తెలుగు భాష, సంస్కృత పదజాలాన్ని తెలుగు మాట లుగా ఏ అభ్యంతరం లేకుండా స్వీకరిస్తుంది .అలా కలగలిసిన మాటల భాషని తెలుగు తల్లికి మణులు పగడాలు కల గలిపి చేసిన భూషణం గా తలపోస్తూ ఉంటాము . అందుకనే మొదట్లో ఇంగ్లిష్ లో శాస్త్రాలని అభ్యసించిన వారు , తెలుగు పండితులు కలిసి సృస్టించిన పదజాలం అంతా సంస్కృతం ద్వారానే. సంస్కృత వ్యాకరణం కలగ చేసే సౌలభ్యం వలన ఇప్పటికి, అదే చేస్తూ ఉంటాం .ఉదాహరణకి Vector అనే మాటకి తెలుగు మాటని తయారు చెయ్యాలనుకుందాం. దానికోసం ఆ మాటని ముందర అర్ద్థం చేసుకుందాం ,అది ఒక రాశి , దానికి ఒక దిశ ఉంటుంది. అని తెలిసాక ‘స’ అంటే కూడిన కనక దాన్ని ‘సదిశ రాశి’ అనేయవచ్చు .ఆ మాట సులభంగానే అర్ధం అవుతుంది .
కాని ఒకోసారి తెలుగు మాత్రం వచ్చినవారికి ఇంగ్లిష్ పదం ఎలా అర్ధం కాదో సంస్కృత పదం కుడా అలాగే అర్ధం కాదు ఉదాహరణకి ‘తన్యత" అనే మాటే కంటే Tension అన్నమాటే తొందరగా అర్ధం అవుతుందేమో . అల్లాంటి మాటే మరోటి’ ప్రేషణం’ అంతకంటే pressure నయమేమో . ఇక్కడ ఇంగ్లిష్ పదానికి ఉచ్చారణ లో దగ్గరగా ఉన్న తెలుగు పదాన్ని సృస్టించా రని గమనించ వచ్చు. Shear కి మాత్రం ‘విరూపకం’ అన్నారు. నిజానికి ఆంగ్ల పదానికి అర్ధం కత్తెర అని .దానికి ‘శీర్యం ‘ అనే పదం ఉచ్చారణలో దగ్గరగా ఉంటుంది . కాని అది వాడలేదు. కత్తెర అని వాడక పోవటానికి తెలుగు మీది చిన్న చూపు ఒక కారణం అనుకుంటాను .దాన్ని ఒక శాస్త్రీయ పదం గా కాక ఇంట్లో వాడే కత్తెర అని అనుకుంటారేమో అన్న భయం కావచ్చు నేనైతే ‘కత్తెరం’ అని వాడుక చేసి చూస్తాను. ప్రజలకి నచ్చితే వాడుక లో నిలుస్తుంది
6.2 సంస్కృతం వాడితె , గుంపు పదాలని సృష్టించ గలుగుతాము:
ఉదాహరణలు ; ‘on’ తో ముగిసే పరి పదాలు ఇంగ్లిష్ లో ఉన్నాయి వాటిని ఏవిధంగా తెలుగు పదాల్లోకి మార్చ గలుగుతామో, చూద్దాము .
Proton = ధన విద్యుత్ కణం లేక ధవిణం అల్లాగే Electron = ఋవిణం ,Neutron = తటవిణం Photon =తేజాణం , Neuron = నాడీ కణం , నాడిణం Ion = విద్యుదావేశం కలిగిన శకలం = విశణం ఇందులో కొన్ని Acronyms( ప్రధమాక్షర నామాలు =ప్రనా మాలు ) వాడటం గమనించ వచ్చు అల్లాగే మరో గుంపు పదాలు ‘ose’ ల తో ముగుస్తాయి వాటికి మార్పులు ఈ కింది విధం లో సూచిద్దా
Glucose = మధోజు, తియ్యోజు , మధుజం, తియ్యజం , Fructose = ఫలోజు , పండోజు , పడుజం lactose= క్షీరోజు ,పాలోజు ,పాలజం
ఆకాశవాణి అన్న మాట బాగా జనం నోట్లో నానాక , Telephone కి దూరవాణి అన్న మాట , Land line కి స్థిర వాణి ,Mobile కి చరవాణి అన్నమాటలు సులభం గా వాడుక లోకి వచ్చాయి . దూరవాణి నుంచి దూర దర్శన్ అన్న మాట సులభం గా రూపు దిద్దుకుంది .
6.3 చిన్న మాటలు : పరి పదాలు ఎంత చిన్నగా ఉంటె అంత బావుంటాయి .
ధూమ శకట గమనాగమన సూచిక లాంటి పదాలు వద్దు ‘రెక్క’ లాంటి పదం ముద్దు 4 లేక 5 అక్షరాల పదాలకి ప్రయత్నించాలి
Symbol అంటే సంకేతం కనక Signal ని (వార్తా సంకేతం ) ని ‘వాకేతం’ గా వాడుక చెయ్య వచ్చు Input = అంతర్గతం Output =బహిర్గతం Design =రూప కల్పన Engineer =యంత్ర జ్ఞుడు ,యంతరుడు ,
7నిర్దిష్టిత :
శాస్త్ర రచన లో వాడే పరి పదాలకి అర్థాలు వివరిస్తూ నిర్వచనాలు ఉంటాయి
ఉదాహరణకి Velocity and Speed .మొదటిది సదిశ రాశి. రెండోది అదిశ రాశి. మనకి వడి అన్న తెలుగు మాట, వేగం ధృతి అనే సంస్కృత పదాలు ఉన్నాయి .అందులో వేగం తెలుగులో ఎక్కువగా వాడే మాట .అందుకని మనం Velocity కి వేగం అని Speed కి వడి అని తెలుగు లో స్థిరపరచవచ్చు
8.దుష్టసమాసాలు:
దుష్ట సమాసాలు కుడా కొండొకచో వినసొంపుగా ఉండి వాడుకలోకి వస్తాయి. ఉదాహరణలు : దురలవాటు నిస్సిగ్గు .అందుచేత అవి వర్జ్యనీయం కాదు. తెలుగు లో శాస్త్రీయ పద్ధతి అంటే సామాజిక శాస్త్రాలలో వాడే పద్ధతి గాను , ముఖ్యంగా మార్క్స్ సిద్ధాంతాన్ని అనుసరించి న పద్ధతి అనే అర్ధం స్థిరపడి ఉండటం చేత నేను విజ్ఞాన శాస్త్రం లో వాడే పద్ధతిని సైన్సు పద్ధతి అని కాని సైన్సీయ పద్ధతి అని కాని వాడుక చేస్తూ ఉన్నాను ఈ పద్ధతిని వివరించటానికి 3 లేక 4 పుటలు వ్రాయాల్సి వస్తుంది. అది వివరించకుండా అర్ధం అవటానికి, సైన్సీయ పద్ధతి అనే పరి పదం వాడటం సుఖం . అది వినటానికి ఏమాత్రం దుష్టం గా ఉండదు
అనన్యం గా అంటే మరో అర్ధానికి తావు లేకుండా, ఒకే విధం గా అర్ధమవటమే నిర్దేశక సూత్రం . ‘ కవి’ ప్రయోగాలు ఎలా గ్రాహ్యాలో , వాడుకలో ఉన్న ప్రయోగాలు కూడా అల్లాగే గ్రాహ్యాలు.
అప్పటికే భాషలో చేరి ఉన్న పదాలు అవసరం తీర్చేవి అయితే , కొత్తపదాలని వాడుక లోకి అనవసరం గా తేవటం, ‘అరువు సొమ్ము బరువు చేటు ‘అవుతుంది .
ఉదాహరణకి ,ఇప్పుడు పాక శాస్త్రం లో ‘ఆయిల్’, ‘ఫ్రై’ ‘ బాయిల్ ‘ లాంటి మాటలు వాడు తున్నారు . వీటికి, ఎంతో కాలం నుంచి వాడుకలో చక్కని పదాలు ఉన్నాయి .అనవసరం గా కొత్తపదాలు వాడుక చేస్తే, పాత మాటలు మరుగున పడి కొన్నాళ్ళకి అర్ధాలు తెలియకుండా పోయే ప్రమాదం ఉన్నది

8 చివరి మాట
పూర్వం train అన్న పదానికి తెలుగు లో ధూమ శకటం ,పొగ బండి అని వాడేవారు. ఇప్పుడు పొగ లేని బళ్ళు వచ్చాక ఈ పదాలు నప్పటం మానేసాయి. ఐవి కాక , train కి ఇంకో మాట ఉంది అది ‘రైలు బండి’ .ఈ మాటకి అర్ధం పట్టాల ( Rails) మీద నడిచే బండి అని అర్ధం . ఇప్పుడు బండి లుప్తమై రైలు అంటున్నాము . దాని వల్ల నష్టం లేదు. ఎందుకంటే Rail అన్న మాటకి వాడుకలో పట్టా అనే ఇంకో పదం ఇంకా ఎక్కువగా వాడుతున్నాము కనక . అన్ని సార్లు వ్యుత్పత్తి అర్ధం ప్రకారం పదం ఉండక్కర్లేదు. దానిని సూచిస్తే చాలు.
ఈ పరిభాష సృష్టించటం లో ఛాం దసం గా ఉండకూడదు .అల్లా ఉండకుండా ఉండటం పండితులకి కష్టం కనక ఈ పనిని వారికి విడిచి పెట్టక ,శాస్త్రం, భాషా రెండూ తెలిసిన వారికి వదిలి పెడదాం .

Written by kavanasarma

February 15, 2018 at 10:33 am

Posted in Uncategorized

%d bloggers like this: