Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

చర్చ 2013 యొక్క 50 వసమావేశం ( 11- 02-2018) లో నేను మాట్ల ాడిన విషయ వ్యాసం

నూతన పదజాలం సృస్టించుకోవాల్సిన అవసరం -పద్ధతి
కవన శర్మ
1. జ్ఞానం
ఏ శాస్త్రం లో అయినా పింగళి నాగేంద్ర రావు చెప్పినట్టు పాండిత్యం కంటే జ్ఞానమే ముఖ్యం పాండిత్యం అంటే పదజాలం తో పరిచయం కలిగి ఉండటం .జ్ఞానం అంటే ఆ పదాలు కలిగించే ఎరుక లేక తెలివిడి .ఈ ఎరుక మనకి రకరకాలుగా కలుగుతుంది. ఆ జ్ఞానం ఆమోదయోగ్యమైన పద్ధతిలో కలిగితే , దాన్ని మంచి లేక సుజ్ఞానం అంటాం. ఈ వ్యాసం లో జ్ఞానం అనే మాటనే సుజ్ఞానం అనే అర్ధం లో వాడబోతున్నాను. సుజ్ఞానం కానిదల్లా అజ్ఞానం అని భావిస్తాను
శాస్త్ర రచన చేసే వారికి శాస్త్ర జ్ఞానం ఉండాలి .శాస్త్రం అంటే ఏమిటి ?
2.శాస్త్రం
ఒక విషయం గురించి న జ్ఞానం యొక్క కూర్పు ని మనం శాస్త్రం అంటాం ఈ కూర్పు మౌఖికంగా ఉండవచ్చు లిఖితంగా ఉండవచ్చు. ఇప్పుడు రమారమి అన్ని శాస్త్రాలు గ్రంథస్థం అయ్యే ఉంటున్నాయి. ఈ మాటకి ఇంగ్లిష్ లో సరైన పదం ఉన్నట్టు తోచదు .అన్ని శాస్త్రాలకి సైన్సు అని వాడుతూ ఉంటారు . సైన్సు ని తెలుగు లో విజ్ఞాన శాస్త్రం అంటాము .
ఎన్నోశాస్త్రాలు ఈ నాడు ప్రచారం లో ఉన్నాయి ? మన వాళ్ళు శాస్త్రాలు 18 అని కాబోలు అంటారు. కాని పాశ్చాత్యులు వాటిని 3 రకాలుగా వర్గీకరిస్తారు .
1 ప్రకృతి కి సంబంధించినవి .వీటినే Natural Sciences అంటారు వీటినే మనం ‘విజ్ఞాన శాస్త్రాలు’ అంటా ము ఉదాహరణలు: భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం ,జీవ శాస్త్రం
2. సమాజానికి సంబంధించినవి వీటిని Social Sciences అంటారు ఉదా : ఆర్ధిక శాస్త్రం ,రాజకీయ శాస్త్రం , వాస్తు శాస్త్రం
3. క్రమబద్ధమూ సంప్రదాయికమూ అయినవి .వీటిని Formal Sciences అంటారు . ఉదాహరణలు భాషాశాస్త్రం ,తర్కశాస్త్రం ,గణిత శాస్త్రం , ,సంగీతశాస్త్రం ,నాట్య శాస్త్రం జోస్య శాస్త్రం .
ప్రతి శాస్త్రం , తనదే అయినదీ ప్రత్యేకమైనదీ ఆమోదయోగ్యమైన మైనదీ అయిన పద్ధతిలో జ్ఞానాన్ని సమకూర్చుకుంటుంది. అందుచేత శాస్త్రీయమైన పద్ధతి అని మనం అనేటప్పుడు అది ఒకే ఒక అనన్యమైన పద్ధతి కాదని గుర్తుంచుకోవాలి .
3 .నూతన పదాలు సృష్టించు కోవాల్సిన అవసరం
ప్రతీ శాస్త్రం లోను శాస్త్ర జ్ఞానం పెరుగుతున్నప్పుడు ఒక కొత్త విషయాన్ని ప్రతి సారి వివరిస్తూ పోకుండా, క్లుప్తత కోసం ఆ భావాన్ని స్పురింపచేస్తు, ఒక పదం వాడటం మొదలు పెడతాము .అటువంటి పదాలని మనం పరిపదాలు ( Jargon) అంటాము. ఇవి ప్రతీ భాషలోను ఏర్పడుతూ ఉంటాయి. సైన్సు విషయాలలొ ఈ పదాలు ,ఇప్పుడు హెచ్చుగా, ముందుగా ఇంగ్లిష్ లో ఏర్పడుతున్నాయి. వాటిని ఇతర భాషల్లోకి అనువదించుకోవాల్సి వస్తోంది. ఒక శాస్త్రం లో అటువంటు పదాలతో కూడిన భాషని ఆ శాస్త్రం యొక్క పరి భాష అని అంటాము . అన్ని సార్లు మనమా భాషలో అంతకు ముందే ఉన్న పదజాలం లోంచి ఆ పరి పదాలని ఏర్పరచు కోవటం కుదరదు. అప్పుడు నూతనంగా పరి పదాలని సృష్టించు కోవాల్సి వస్తుంది
ఉదాహరణకి తెలుగు సాహిత్యానికి చెందిన సాహిత్య శాస్త్రం గురించి చెప్తాను. ఒక సమయం లో పురాణాలు వచ్చాయి. ఆతర్వాత ప్రబంధాలు నాటకాలు వచ్చాయి. అచ్చు యంత్రాలు వచ్చాక గద్య సాహిత్యం వచ్చింది . అప్పుడు వీటిని సూచించే పదాలు వాడుకలోకి వచ్చాయి . నాలుగు కాలాల పాటు నిలిచిన , నిలవ బోతున్నవి అని మనం అనుకునే ప్రామాణిక , గ్రంథాలని ఉద్గ్రంథాలు ( Classics) అన సాగారు. కవిత్రయ భారతం ,పోతన భాగవతం , తిరుపతి వెంకటకవుల పాండవోద్యోగ విజయాలు ,గురజాడ కన్యా శుల్కం , శ్రీ శ్రీ మహాప్రస్థానం అటువంటివి. అలంకార శాస్త్రానుగుణం గా వచ్చిన వాటిని సాంప్రదాయ సాహిత్యం అన్నారు. అందులో కొన్నిపురాణ గ్రంథాలు ఉన్నాయి కొన్ని ప్రబంధాలు ఉన్నాయి. అచ్చు యంత్రాలు వచ్చి విద్య చాలామందికి అందుబాటులోకి వచ్చి చదువరులు పెరిగాక, వారి అవసరాల మేరకు వచ్చిన సాహిత్యాన్ని ఆధునిక ( Modern) సాహిత్యం అన్నారు .నవలలు ,కథలు వ్యాసాలు కవితలు, గేయాలు ఆ కోవా లోనివి .ఇవి న్యూటనిక విశ్వ వీక్షణానికి చెందినవి. అందులోని యాంత్రికత పై తిరుగు బాటుగా వచ్చిన సాహిత్యాన్ని ఆధునికాంతర ( Postmodern) సాహిత్యం అన్నారు.
చాలా సార్లు ఈ పరిపదాలని రెండు మూడు వాక్యాలతో నిర్వచించటం కుదరదు. పెద్ద విపులమైన వివరణలు కావలసి వస్తాయి. ఇంగ్లిష్ లో ఉన్న ‘సైన్సు ‘ అనే పదాన్ని నిర్వచించటం చాలా కష్టం . కొన్ని పుటల వివరణ ఇస్తారు. ‘సైన్సు’ అన్న మాట వాడకుండా పోతే ప్రతి సారి ఇంత వివరణ ఇవ్వాల్సి వస్తుంది.అటువంటి ఇబ్బందే పేరడీ , చిత్ర కవిత్వం వచనకవిత్వం మొదలైనవి నిర్వచించటం లోనూ ఉన్నది .ఆ ఇబ్బందుల నుంచి బయట పడేసేవే పరి పదాలు . ఒక శాస్త్రానికి సంబంధించిన ఒక పరి పదం వాడినప్పుడు, ఆ శాస్త్రం గురించి మాట్లాడే అందరికి ఒకే భావం మనసులోకి వస్తుంది. అంటే విపుల మైన భావానికి క్లుప్తమైన సంకేతమే, ఈ పరి పదాలనీ ,ఇవి అవసరం బట్టి పుట్టుకు వస్తాయని, పుట్టిస్తారని, గుర్తు ఉంచుకుందాము.

Written by kavanasarma

February 15, 2018 at 10:37 am

Posted in Uncategorized

%d bloggers like this: