Kavana Sarma Kaburlu – Sarada Anuvadalu

All Rights Reserved

4 వ ప్రకరణం ఆత్మ కథ

4 వ ప్రకరణం
అక్షరాభ్యాసం – 1944
నాకు తిండి చాలా ఇష్టం . బియ్యానికే కరువు . కూరలకి లేదు . మా ఇంట్లో చిక్కుడు పాదులు డొండ పాదులు విరగ కాసేవి. బాగా గింజ పట్టిన చిక్కుడు కాయ కూరలో తొక్కలు అక్కలకి అట్టేపెట్టి గింజలు తినగలిగినన్ని తినే వాడిని.పువ్వు ని అంటి పెట్టుకుని ఉన్న లేత దొండ కాయాలని పచ్చిగా తినే వాడిని. కోసేటప్పుడు పాదుకు పట్టిన గొంగళి పురుగులు మన మీద కి పాక కుండా పడకుండా చూసుకోవాలి. పాకాయో పడ్డాయో గొప్ప దురద ఎంత కొబ్బరి నూనె పట్టించినా తగ్గదు.
ఇంటి ముందు వేపచెట్టు అంతకుముందు ఉగాదికి పూతకి వచ్చి తరవాత పళ్ళు కాసింది. పళ్ళ లోని తియ్యటి గుజ్జు తిని ఆ ఎంగిలి గింజలని బాగా కడిగి ఆరబెట్టేవాళ్ళం .ఆ ఎండిన గింజలతో మా మామ్మ కడుపులో పురుగులకి వేపకాయ మాత్రలు చేసి మింగీంచేడి. పొరపాటున కుడా నమల రాదు. నమిలితే చచ్చామే. గొప్ప చేదు. ఇంట్లో గుంటగలగరాకు చెట్లు వాటంతట అవే మొలిచేవి . వాటి ఆకుని ఉప్పు తో దంచి ఉండలు చేస్తే ,రుచికి రుచి .దగ్గుకు మందు. యుద్ధం లో దెబ్బలు తగిలిన సైనికులు కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు కొందరు వెనక్కి వచ్చేసారు . వాళ్ళు కోరింత దగ్గులు, గజ్జి వెంట పెట్టుకుని తెచ్చారు. మా పిల్లలం దరికి రెండు చేతుల నిండా గజ్జే . సిబజాల్ పౌడ ర్ బాగా జల్లి లేక బోరిక్ పౌడర్ కొబ్బరి నూనె తో బాగా కలిపి గజ్జి పైన పూసి పాత మెత్తని బట్టలతో కట్లు కట్టేది మా అమ్మ . మేము ముగ్గురం , అన్నలు ముగ్గురు. మొత్తం ఆరుగురం . అందరికి అన్నం కలిపి నోట్లో పెట్టాల్సి వచ్చేది . ఆ రోజుల్లో గంధకం మందులే గొప్ప మందులు . గజ్జి తగ్గేసరికి కోరింత దగ్గులు పట్టుకున్నాయి. దానికి కి గుంట గలగరాకు ఉండలే మందు. కరక్కాయలు బుగ్గన పెట్టుకోవటమే ఉపశ మనం . వేసంకాలం మధ్యాహ్నాలు నులక మంచాల మీద నీళ్ళు జల్లిన దుప్పటిలు వేసుకుని పెద్ద వాళ్ళు పడుక్కుంటే ఆ వడ తగిలే ఎండల్లో నీడ పట్టు ఆటలు చిన్న వాళ్ళం ఆడుకునే వాళ్ళం
ఆ వే సం కాలం లోనే నాకు అక్షరాభ్యాసం చేసారు . పలక మిద ఓ న మా లు దిద్దాను ఆ ఘనకార్యం చేసినందుకు మా అమ్మమ్మ నాకు ఒక వెండి కంచం ఇచ్చింది. అందులో చాలాకాలం అన్నం తిన్నాను .బిళ్ళ పెరుగు అంచు దాకా పోయించుకుని అందులో అన్నం కలుపుకుని నిమ్మ కాయ బద్ద నంచుకుంటూ తినటం ఒక గొప్ప జ్ఞాపకం
ఆ వేసం కాలం రాత్రిళ్ళు ఆరుబయట నాన్న పక్కలో పడుక్కుని పాలపుంతని సప్తర్షి మండలాన్ని గుర్తించటం నేర్చుకున్నాను. మా నాన్న చెప్పిన కుంచం భట్లు, మిడతం భట్లు, మడేల్ సేనాని, భాగవతం కథలు వినే వాడిని . నా చిన్న పేము కుర్చీని తన ‘రాలి’ సైకిల్ కి కట్టి నన్ను అందులో కూర్చో బెట్టుకుని మా నాన్న రౌండ్స్ వేసేవాడు . ఇంటి వద్దకు వచ్చిన ఏనుగు కి అరటిపళ్ళు మావటికీ నూకలు ఇచ్చి మా అమ్మ నన్ను ఏనుగు ఎక్కించటం గుర్తు ఉంది .
చదువు మొదలైన నాలుగు సంవత్సరాల దాక నేను స్కూల్ ముఖం ఎరగను . నేను కడసారి సంతానమే కాదు. ఆయ్ ( హెర్నియా ) ఉన్న అర్భకుడిని. అందుకని నన్ను నిరంతరం వాళ్ళ కళ్ళకి ఎదురుగా ఉంచుకునే వారు. అందుకని నాకు చదువు చెప్పటానికి ప్రైవేటు మేస్టారిని పెట్టారు . ఆయన చీకటి పడ్డాక వచ్చేవాడు. అప్పటికి ఇంట్లో ఎలేక్టిక్ దీపాలు లేవు . హరికెన్ లాంతర్లలో చదువు సాగేది వాటిని ముగ్గు లేక బూడిద వేసి రోజు తెల్లగా తుడుచుకోవాలి అదో ఆట.
" వానల్లు పడాల వరిచేలు పండాల మా నాన్న తేవాల మా అమ్మ వండాల మా కడుపు నిండాల ", " ఆడతాడు పంతులు ఆడిస్తాడు పంతులు. పాడతాడు పంతులు పాడి స్తాడు పంతులు " లాంటి పాటలు చిన పోలాయిని ‘కుతకుతలాడే దేమిటయా ‘ అని పులి అడగటం "గుగ్గీలయా అని అతను చెప్పటం " కొంచెం పెట్టు రుచి చూస్తా !" అని మొదలు పెట్టి " అన్ని పెట్టు ఆరగిస్తా " అంటూ అది అతన్ని వేధించటం అప్పుడు పెద పోలాయి వచ్చి పులికి పొయిలో కట్టె తీసి వాత పెట్టడం లాంటి కథలు తెలుగు వాచకం లో ఉండేవి. ఆ పుస్త కాలు అన్ని వెంకట్రామా అండుకో వారు అమ్మేవారు . మాకు ఆ విషయం మా తరవాత పుట్టిన ఎల్ బీ. శ్రీరాం చెప్పకుండానే తెలుసు. అతనికి తెలియనిది ఆ పుస్తకం దగ్గర పెట్టుకున్నాక " అన్నం తిని పండుకో " అనే వాళ్ళమి.
ప్రైవేటు మేస్టారి తో ఒక చిక్కు వచ్చింది. లక్ష్మి వాళ్ళ నాన్న మరో ఉరు వెళ్లి పోయి ప్రసాద్ వాళ్ళ నాన్న వచ్చారు మా పక్కింట్లోకి ఇంకం టేక్స్ ఆఫీసరుగా . ప్రసాద్ కి నా మేస్టారే మేష్టారు. వాడికి నేనంటే పడేది కాదు. గుడ్డిలో మెల్ల , వాడు కొట్టే వాడు కాదు. నాకు బాగా గుర్తున్న విషయం ఒకోసారి మా ఇద్దరికీ మేష్టారు ప్రసాద్ ఇంట్లో పాఠం చెప్పేవారు. వాళ్ళింట్లో ఎలక్ట్రిక్ దీపాలు ఉండేవి . వాళ్ళు మాకంటే బాగా డబ్బున్న వాళ్ళు .అయిన వాళ్ళ ఇంట్లో మేము వండినవి తినకూడదని మా మేష్టారు తను తినే వారు కాదు నన్ను తిన నిచ్చేవారు కాదు.
నేను మా అక్కలతో బొమ్మల పెళ్లికి ఎవరింటికో వెళ్ళటం వాళ్ళు మాకు చద్ది అన్నం పచ్చడి వేసి, పెట్టడం, మేము తినాల్సి రావటం నాకు గుర్తుంది. వాళ్ళది మా కులమే కాబోలు. నేను మా అక్కలు ,ఆ తరవాత ఏ బొమ్మల పెళ్ళికి వెళ్ళ లేదు
నేను గుంటూరు రామ కోటి ఉత్సవాలలో తప్పి పోవటం , మళ్లి బెజవాడ లో తప్పి పోవటం , మా మూడవ అన్నయ్య , రాముడు మేమందరం కళ్ళు ముసుకున్నప్పుడు ఆశ్చర్యకరం గా నేతీ మీద, పంచదార మీ ద రాముల వారి పాదాల ముద్రలు తెప్పించటం , తన పేరు రాముడే అవటం వలన ఆ మహిమలు తనకి సహజం గానే అబ్బాయని చెప్పటం, మా కుచిభట్ల శివ రామకృష్ణయ్య మావయ్య కొడుకు పెళ్లి గుంటూరులో జరగటం ఇవన్ని "మా కుటుంబం’ అనే పుస్తకం లో వ్రాసాను . ఆపుస్తకం వాహిని బుక్ ట్రస్ట్ వారి వద్ద దొరుకుతుంది . అవి ఇక్కడ వ్రాయను .

Written by kavanasarma

September 1, 2017 at 11:23 am

Posted in Uncategorized

%d bloggers like this: