Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

My autobiography 3rd Chapter on Gunturu koritipaadu

3 వ ప్రకరణం
గుంటూరు కొరిటి పాడు ( 1943)
మాటలు వచ్చాయి కాని అక్షరాలూ రాలె!
మేము గుంటూరు వెళ్లాం . మా నాన్నగారు రమారమి పూర్తి అయిన ఒక ఇంటిని కొరిటిపాడు లో అద్దెకు తీసుకున్నారు. ఆ ఇంటికి ఎదురుగా లింగం ఇంటిపేరున్న ఒక ప్లీడర్ గారు పక్కన పిచ్చయ్య చౌదరి గారనె ఒక ఇంకం టాక్స్ ఆఫీసరు , కొద్ది దూరం లో గండికోట గోపాలరావు గారనే మరో యూని నివర్సిటి మేస్టారు , కుడి పక్కన పెరట్లో ఉయ్యాల ఉన్న ఉన్న మరో ఇల్లు , ఎదురుగా మొక్కజొన్న వేరుసెనగ చేలు ఉండేవి. గుంటూరు వెళ్ళటం తోటే అక్కడ మా నాన్న గారు ఇంట్లో తవ్వించిన బావిలోని నీళ్ళు తాగ గానే నాకు పిడుగుల్లాంటి మాటలు వచ్చేసాయి. .
మా అక్కలు స్కూల్ కి వెళ్ళేవాళ్ళు వీధి వైపు ఒక రిక్షా లాగే అతను ,భార్య తో కాపురం ఉండే వాడు. పేరు హుసేన్ అని గుర్తు .ఆమె ఇంటి పనులు చేసేది .అతను అక్కలని స్కూలికి తీసుకు వెళ్లి ,తీసుకు వచ్చే వాడు . వాళ్ళతో పక్కింటి లక్ష్మి తను తయారయ్యేది, స్కూలికి వెళ్ళటానికి . వాళ్ళ నాన్నకి కారున్నా సరే. లక్ష్మికి నేనంటే పడేది కాదు. నన్ను కొట్టేది . నాకంటే ఆ పిల్ల పెద్దదీ . నేను తిరిగి కొట్టలేని పరిస్థితి అందుకని నాకూ ఆపిల్ల అంటే పడేది కాదు.
తమ్ముడిని కొడుతుందని , అప్పుడు తమ్ముడు ఏడుస్తాడని మా అక్కలు ఆ పిల్లని రావద్దనే వారు. కాని " నేను మిమ్మలిని కొట్టను .మీరు మంచి వాళ్ళు .తంబు మంచి వాడు కాదు "అని ఆ పిల్ల వాళ్లకి నచ్చ చెప్పటానికి ప్రయత్నించేది. సీట్ మీద చోటు ఇవ్వకపోతే కింద కాళ్ళ దగ్గర కూర్చోడానికి సిద్ధ పడేది. నా ఏడుపంటే మా నాన్న గారికి భయం మా నాన్నగారు "మీ పిల్లని మీ కార్లో పంపించు కోండి " అని చెప్పేసా రు వాళ్ళతో . అంతే ఆఫీసరు గారి తల్లి అంటే లక్ష్మి వాళ్ళ నాయనమ్మ మా ఇంటికి వచ్చి "మా పిల్ల చిన్న పిల్ల నాయనా. దానికి తెలియదు " అని నన్ను ఒప్పించే ప్రయత్నం చేసింది. నేనేదో చాలా పెద్ద వాడిని అయినట్టు
అప్పుడు నాలోని మిమిక్రి కళాకారుడు బయటపడ్డాదుట మా అమ్మ తను చని పోయేవరకు చెప్పి నవ్వేది ,. "ఆ మొద్దేమో కొడుతుంది వాళ్ళ మామ్మ వచ్చి మా పిల్ల చిన్న పిల్ల నాయనా అంటుంది "అని ఆవిడని అనుకరిస్తూ చెప్పానుట. ఇప్పటికీ నాకు అనుకరించే అలవాటు పోలేదు. ఇక్కడ మరో విషయం చెప్పాలి. మా ఇంట్లో మగపిల్లలమైన నాకు మా అన్నలకి ఆడపిల్లలిని, ఇంట్లో వాళ్ళనైనా పై వాళ్ళనైనా , తిట్టదలుచుకుంటే, మాకు ‘మొద్దు’ అనే తిట్టుకు మించి తిట్టే పవర్సు లేవు. అక్కలు ఇతర పెద్దలు నన్ను ‘ వెధవ ‘అని తిట్టేవారు. అంతకు మించిన తిట్టు వాళ్ళకీ తెలియదు. మా పెద్ద నాన్నగారి ముగ్గురు పిల్లలు మా ముగ్గురి కంటే పెద్ద వాళ్ళు అందుకని, వాళ్ళని తిట్టే పవర్లు మా ముగ్గురికి లేవు. మరి మా అన్నలు ఒకరినొకరు తిట్టుకునే వారో కాదో నాకు గుర్తులేదు. మా ఇంట్లో, మగ పిల్లల మీద ఒక దెబ్బ వేసే అలవాటు మా అమ్మకి , మా మామ్మ కి , మా అల్లరి భరించలేని సందర్భాలలో ఉండేది. ఆడ పిల్ల ల ని తిట్టడానికే వీల్లేదు కొట్టడం కూడానా ! వాళ్ళు పెళ్ళిళ్ళు అయి వెళ్లి పోతారుట కదా అందుకని. మా పెద్దక్క కి కాస్త నయం, 18 వ ఏట పెళ్లి అయింది .రెండోదానికి 2౩వ ఏట అయింది. అన్నాళ్ళు దాన్ని తిట్ట కుండా భరించటం ఎంత కష్టమో నన్ను అడగండి చెప్తాను .
ఇంతకు మా ఇంట్లో వాళ్లకి నా ఏడుపంటే చచ్చే అంత భయం . ఎందుకంటే నేను ఏడిస్తే నా పేగులు జార్తాయి కదా . ఒకో సారి జారినప్పుడు అక్కడే బిగిసి పోతాయి. అప్పుడు నా ప్రాణం పోవచ్చు . నేను మా అమ్మ కి ఇంట్లో వాళ్లకి ప్రాణ ప్రదం. అందుకని బందర్లో డాక్టర్ మా వాళ్ళని నేను ఏడవకుండా చూసుకోమన్నాడు నా ప్రాణాల మీదకి వచ్చిన ఒకప్పుడు. ఆ యుద్ధ సమయం లో ఆపరేషనంటే కష్టం కదా .
ఆ బిగిసి పోయిన పేగుల్ని పైకి యధా స్థానం లోకి పంపటానికి ఆ డాక్టర్ వేడి నీటి కాపడాలు లాంటి చాలా ప్రయత్నాలు చేసి చివరగా లాగి లెంపకాయ కొట్టాడుట అప్పుడు నేను బెక్కుతూ పొట్టని పైకి లాక్కున్నానుట. పేగులు యదా స్థానానికి వెళ్లి పోయాయిట ." ఆయి , ఎప్పుడు వచ్చినా ఇలా తోసుకో" అని , నాకు ఆయి వస్తే చేసుకోవాల్సిన ప్రధమ చికిత్స నేర్పారు .అప్పటినించి పేగులు దిగీ దిగగానే పైకి చేత్తో తోసుకోవటం నాకు అలవాటు అయింది. నేను ఏడవకుండా చూసుకోవటం మా వాళ్లకి అలవాటు అయింది
అన్నట్టు మాకు అప్పటికి నాన్న ని , నాన్న గారు అని పిలిచే అలవాటు అవలేదు తరవాత మా అమ్మ నెమ్మదిగా అలవాటు చేసింది . మా నాన్న అన్నం తిని ఆఫీసుకి వెళ్ళిపోయాక , అక్కలు స్కూలికి వెళ్ళిపోయాక , నేను అమ్మ మిగిలిపోయేవాళ్ళం. అమ్మకి నాతో అక్కలు వచ్చే వరకు ఆడే ఓపిక ఉండేది కాదు. నాకు గుడ్డ పిలికలను ఒక గుడ్డలో చుట్టి బంతిలా చేసి ఆడుకోమనేది . నాకంటూ ఒక చిన్న పేము కుర్చీ కొన్నారు అది వరండాలో వేసుకుని అందులో కుర్చుని ఈగలని చీ మలని పాలించే వాడిని. నన్ను డాక్టరుగా ఉహించుకునే వాడిని .డాక్టర్ చిన్న పిల్లల మీద కత్తి వాడ గలిగిన వాడు. అంటే చాలా పవర్ ఉన్నవాడు.
అలా వంటరిగా ఆడుకునే రోజుల్లో విధిలో వెళ్తున్న నా కంటే గుప్పెడున్న ఒక పిల్ల , ఆడపిల్లలకి మొగ పిల్లలకి ఉండే తేడా నాకు సులువుగా వివరించి చెప్పింది. .సులువుగా అని ఎందుకన్నాను అంటే నాకు పొడుగు చొక్కాయే తప్ప లాగు ఉండేది కాదు .ఆ పిల్ల పొడుగు గౌను మాత్రమే వేసు కుంది.
నేను ఆవయస్సులో ఇంకా చాలా నేర్చుకున్నాను . ఒకటి రెండురోజులు వెళ్ళాల్సిన చోటుకి వేళ్ళక పోతే, ఎనిమా ఇస్తారని తెలుసుకున్నాను . దానికి " వాడు ఆటల్లో పడి మర్చి పోతాడు" అనేది అమ్మ . అది పూర్తి సత్యం కాదు ఆ రోజుల్లో మాకు కంట్రోల్ ( రేషన్) బీ య్యం ఇచ్చే వారు. ఆ బియ్యం ఎర్రగా మోటుగా ఉండేవి ." ఈ కంట్రోలు బియ్యం తిన లేక చస్తున్నాను" అనే వాడిని ట . విన్న మాటని తిరిగి ప్రయోగించే శక్తీ నాకు చిన్నప్పుడే అలవాటు అయింది. నా శక్తికి మా అమ్మ, కృష్ణుడి విషయం లో యశోద లాగా అబ్బుర పడేది . అబ్బురపడేదే అమ్మ!. ఆ దుర్భిక్షం రోజుల్లో ఎవరో ఏ కారుణ్య సమాజం వాళ్ళో మా ఇంట్లో ఓ పావు బస్తా బియ్యం పడేసి "బిచ్చగాళ్ళకి బిచ్చం వేస్తూ ఉండండి" అన్నారు . మా కోరిటి పాడుకి వచ్చే బిచ్చగాళ్ళు ఎవరంటే బుడబుక్కల వాళ్ళు గంగిరెద్దు వాళ్ళు . అక్కడ దాన కర్ణుడు ఎవరంటే నా చమ్మ చెమ్మ . నరసింహ శర్మ కి అది ఒక రూపాంతరం
నాకు చిన్నప్పుడే ఏ కోణం లో ఉచ్చని వదిలితే ఎంక్కువ దూరం పోయి పడుతుంది అని ప్రయో గాలు చేయటం గుర్తుంది. ఆ చిన్నప్పటి ప్రొజెక్టయిల్ అధ్యయనం కి నేను పెట్టిన పేరు " ఆకాశం అంత పెద్దది ". ఆ తరవాత ఆ కుతూహలం నన్ను న్యూటనిక డైనమిక్స్ లో గట్టి వాడిని చేసింది . ఈ ప్రశ్నకి సరైన జవాబు యునివర్సిటీ పరీక్షలో వ్రాయ గలిగాను
నా చిన్నప్పుడు హాస్యం ఏమిటంటే ముసలి మగ వాళ్ళు చిన్న ఆడపిల్లలిని " నన్ను పెల్లాడుతావుటే?" అని ముసలి ఆడవాళ్ళు నా వయస్సు వాళ్ళని " మా మనవరాలిని పెళ్ళా డ్తా వా ? " అని అడగటం. నేనేమన్నా శ్రీ కృష్ణుడినా కోరిటిపాడు లో ఉన్న బొడ్డు ఊడని గుంట లిని పెళ్ళాడటానికి .
మాకు పొద్దున్నే ఒక ముసలమ్మా పెరుగు పోసేది. కొలతకి ఒక కొబ్బరి చిప్ప వాడేది. ఆమే రాగానే నేను ఒక చిన్న గిన్నె తీసుకుని వెళ్లి పెరుగు " బిళ్ళ " వెయ్యమని అడిగేవాడిని. మా ఇద్దరికీ మామ్మా మనవడి అనుబంధం ఏర్పడి పోయాక ఆమె అడగనే అడిగింది " మా మనవరాలిని పెళ్లాడ్తావా ?" అని నాకు గొప్ప కోపం వచ్చి " ఆ మాటంటే ముసులమ్మా ! నీ ముంత బద్దలు కొడతా " అనేసాను. మా అమ్మ నా ప్రాస కి అబ్బురపడిపోయి ఆ విషయం నేను మర్చిపోకుండా, గుర్తు చేసేది ఆతర్వాత .
చేలలో పాలు పట్టిన మొక్క జొన్న కంకులు కోసుకు తినటం , వేరుసేనగ మొక్కని వేళ్ళతో సహా పీకి గింజలు తినటం ఒక గొప్ప అనుభవం. అమ్మ ఇచ్చిన దమ్మిడి (రూపాయిలో 192 వ వంతు ) తీసుకుని ఇంట్లో ఉన్న రిక్షా అతని భుజం ఎక్కి " లగేత్తు " అంటూ కోమటి కొట్టుకు పరిగెత్తించి రెండు నిమ్మ తొనలు ( ఆ ఆకారం లో ఉండే )పిప్పరమెంటు బిళ్ళలు కొనుక్కు తినటం నేను మరిచి పోని మరో అనుభవం .
అక్కడ ఉన్న రోజుల్లోనే పందిని చంపటం ఎంత కష్టమో తెలుసు కున్నాను. యానాదులు దాని చుట్టూ నిలబడి దాన్ని కర్రలతో కొరడాలతో కొడుతూ . ఈటేల్తో పొడుస్తూ అలవగొట్టి చంపేవారు. పంది అరుపులతో కోరిటిపాడు దద్దరిల్లేది . వినటానికి చాలా బాధగా ఉండేది . కాని పందులని పెంచేదే తినటానికి అని, తినా లంటే చంపాలని ,నాకు ఆ రోజుల్లోనే అర్ధ మయి పోయింది. భూతదయ అంటే అనవసరం గా హింసించకు అని అర్ధం అని , పందుల చర్మం బాగా మందం ఆని , చర్మం కింద కొవ్వు ఉంటుందని అందుకని వాటిని హింసించ కుండా మామూలు పద్ధతుల్లో చంపలేరని నాకీనాడు తెలుసు. కాని నా పేరు లో ఉన్న ‘వరాహం’ వలన ఇప్పటికి నేను వాటి పక్షమే . వాటి బాధ నాకు బాధే .
మరో జ్ఞాపకం , శివుడి ఆజ్ఞ కి జమాల్ చావుకి సంబంధించినది . పక్కింటి లక్ష్మి వాళ్ళ పని వాడి పేరు జమాల్. అతనికి పని లేనప్పుడు ఇంటి ఎదురుగా ఉన్న వేప చెట్టు కింద కూ ర్చుని బీడిలు కాల్చేవాడు. ఆ రోజు రెండు చినుకులు పడి పిడుగు పడింది నేను మా అమ్మ , మా మామ్మ చూస్తుండగానే ఆ చెట్టులో ఒక పెడ నల్లగా కాలి విరిగి పడి పోయింది. మా అమ్మ నోటంట " అయ్యో జమాల్" అన్న మాటలు బయట పడ్డాయి. కాసేపటికీ చెట్టు చుట్టూ గుమి కూడిన వాళ్ళు చెప్పారు ‘ జమాల్ అంతకుముందే అయ్యగారు పిలిస్తే లోపలి వేల్లాడుట . వాన కి భయపడి చేట్టు కిందకి చేరిన మరొకడు ఆ పిడుగుకీ చచ్చి పోయాడుట . అప్పుడు మా మామ్మ అంది" ‘శిముడి’ ఆజ్ఞ లేందే చీమైనా కుట్టదని .జమాల్ విషయం లో ఆజ్ఞ ఇవ్వలేదు . రోజులు తీరిన మరొకడి కోసం పిడుగుకీ ఆజ్ఞ ఇచ్చాడు " మా మామ్మ చెప్పిన కథల్లో ‘ ఒకడికి తనని చెట్టుకి ఉత్తరపు కొమ్మకి ఉరి తీస్తాడు రాజు అని ముందే తెలిసి చివరి కోరికగా " తూర్పు కొమ్మకి ఉరి తీయించండి మహా రాజా " అని అడిగాడుట .రాజు సరే అన్నాడుట. సరిగ్గా మనిషి వేలాడే సమయానికి ప్రచండంగా గాలి వీచి తూర్పు దిక్కున ఉన్న కొమ్మ ఉత్తరం వేపు తిరిగింది ట. ఇటువంటి కథలు మా మామ్మ కి బోలెడు వచ్చు.
ఒక రోజు అరుస్తున్న ఆవుని తీసుకు వచ్చి మిగిలిపోయిన వేప చెట్టుకి కట్టేసారు .ఆపైన ఎక్కడినుంచో ఒక ఆంబోతు ని కర్రలతో అక్కడికి తరుముకు వచ్చారు. ఆ ఆంబోతు తన ముందరి కాళ్ళను ఎత్తి ఆ అవుపై వేసింది. ఆ ఆవుకు తప్పించుకుని పా రి పోయే అవకాశం లేదు " అమ్మా ! ఆ ఆంబోతు ఆవుని చంపేస్తోంది " అని అరిచాను మా అమ్మ దాన్ని రక్షించ గలదన్న ఆశ తో. మా అమ్మ మాట్లాడకుండా , నన్ను రెక్కపుచ్చుకుని లోపలి లాక్కు వెళ్లి తలుపులు వేసేసింది. పెద్దయ్యాక కొత్తగా ఈడేరిన పిల్లని లోపల పెట్టి మగ వాడిని లోపలి పంపి, బయట గొళ్ళెం పెట్టే సినిమా దృశ్యాలు చుసినప్పుడ ల్లా ఆ ఆవే గుర్తుకు వచ్చేది .
తరవాతి ప్రకరణం నా ప్రధమ గురువు మా నాన్నే !

Written by kavanasarma

August 29, 2017 at 3:12 am

Posted in Uncategorized

%d bloggers like this: