Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

aathma katha

2 వ ప్రకరణం
1942 క్విట్ వైజాగ్
అది జనవరో ఫెబ్రవరియో తెలియదు కాని సంవత్సరం మాత్రం 1942. .ఆ సంవత్సరం చాలా ముఖ్యమైనది బాధాకరమైనది . నాకు భార్య కాబోయే నండూరి విజయలక్ష్మి పండిట్ ఆ సంవత్సరం అక్టోబర్ లో పుట్టడం కారణం కాదు ఎందుకంటే ఆ పిల్ల ఒకత్తి ఈ భూమి మిద ఉన్నట్టు 1959 లో ఆమె ఆంధ్రా యూనివర్సిటి లో చేరే వరకు తెలియదు.
ఇంతకు హెర్నియా అనేది చాలా సాధారణ మైన జబ్బే . నిజానికి నేను దానితో ఏ బాధా లేకుండా 15 ఏళ్ళు బతికేసాను కాని పెహులతో సహా వట్టాల సంచిలోకి దిగిన పొర అక్కడే బిగిసి పోతే ,సంచి ఉబ్బి గట్టి పడుతుంది .అడి ఆవిధంగా 24 గంటలు ఉంటె, ప్రాణం పోతుందని మా నాన్నగారు ఆ తరవాత నాకు చెప్పేవారు. అందుకని నాకు ఆపరేషన్ చేయిన్చేయాలన్న నిర్ణయం, ఆ జనవరి లో తీసుకున్నారు. . ఆ రోజుల్లో ఆపరేషన్లు ప్రాణాంతకాలు. మత్తు మందు ఇవ్వటం ఈ నాటికి ప్రమాదం తో కూడిన విషయమే. ఆ రోజుల్లో మరింత . ఆపరేషన్ విజయవంతంగా జరిగినా తరవాత ఉచ్చ బిగ దీయటం జరిగేది అప్పుడు సన్నని ట్యూబ్ వెయ్యటం దాంతో సుక్ష్మ జీవుల వలన రోగాలు రావటం చాలా సాధారణం. ఇదంతా మా పెద్ద నాన్న గారిక విషయం లో జరిగిందిట
మా దొడ్డమ్మ కూచి భట్ల సుందరమ్మ( సిని నటుడు డాక్టర్ శివరామకృష్ణయ్య గారి సోదరి )1936 జనవరి లో కాన్పు లో పోయిందిట .అప్పుడు మా పెద్ద నాన్న గారు హఠాత్తు గా జబ్బు పడిపోయారుట . అది ‘షాక్ ‘మధుమేహం అయి ఉంటుంది అని ఇప్పుడు నేను అనుకుంటాను అప్పటి నుంచి ఆయనకీ ఒక దాని తరవాత ఒక టి జబ్బులు, శస్త్ర చికిత్సలు , జటి లమైపోయాయి. నాకు 19 42 పక్క మిద పడుక్కుని పక్క పుళ్ళ తో బాధపడుతూ ఉండిన ఆయన గుర్తు ఉన్నారు. ఆయన దిపెద్ద గంభీరమైన దేహం . మా దొడ్డమ్మ పోయాక 1937 నవంబర్ లో పుట్టిన మా రెండో అక్కకి ఆవిడ పేరు విశాఖ దేవత, కనక మహాలక్ష్మి పేరు కలిపి కనక సుందరి అని పేరు పెట్టారుట .మా అమ్మ చెప్పేది
ఇంతకు మా ఇంట్లో మా వాళ్ళు ఆపరేషన్లంటే బెదిరిపోయి ఉన్నారు . ముందస్తుగా సుంతీ చేస్తే కొంతవరకు అటువంటి ప్రమాదాలనుంచి రక్షించుకోవచ్చు అని డాక్టర్లు చెప్పారుట .ఇవన్నీ కుడా ఆప్త వాక్య ప్రమాణాలే .
నా అనుమతి ఎవరు అడగలేదు నన్ను కింగ్ జార్జి ఆసుపత్రి కి పట్టుకు పోయారు అక్కడ మానాన్న గారు నా చేతులు ,మరో మగ వాడు నా కాళ్ళు ,పట్టుకున్నారు .ఆ దృశ్యం నాకు బాగా గుర్తు ఉంది . డాక్టర్ చేత్తో కత్తి పట్టుకుని నా అంగాన్ని మరొకరి సాయం తో పెన్సిల్ చెక్కినట్టు చెక్కేసాడు . నా ఉపమానాలు కాళిదాసు , రావి శాస్త్రి ల ఉపమానాల్లాగా నాజుకుగా ఉండవు. మాయా శశి రేఖ చేతల లాగా మోట గా ఉంటాయి . నేను పిట్టలా చిన్నగా ఉన్నా నా ఏడుపు కూత మాత్రం ఘనం . రెండు నెలల తరవాత విన్న సైరన్ మోత కి దీటుగా డాక్టరు హడిలి పోయేలా , నా అరుపులు ఉండటం నాకు గుర్తుంది. అంత నొప్పి పెడితే నేనే కాదు మహా మహా మీరైనా అంతే గట్టిగా ఏడుస్తారు. అయిపోయిన తరవాత కూడా చాలా సేపు ఏడ్చాను.
గడ్డమొకటి ఉంటె నువ్వు సాయిబు వే అనేవాళ్ళు మా బావలు .దాని అర్ధం పెద్దయ్యాక తెలిసింది. జంధ్యం తీసేసి గడ్డం పెంచాక, దేశం లో సామరస్యాలు చె డాక మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్ సినిమా చూసాక ప్రమాదం బోధపడింది అప్పటికి నాకు 70 ఏళ్ళు వచ్చాయి . నేను ప్రస్తుతం చెప్తున్నది నా 3 వ ఏట జరిగిన కథ

ఏప్రిల్ 6 వ తేది న మళ్లి అదే ఆసుపత్రిలో జేర్చారు .నేను రానని ఏడుస్తుంటే మా అమ్మ దగ్గరికి తీసుకుని ఏడ్చిందే కాని తీసుకు వెళ్ళటం మాన లేదు . పొద్దున్న 8 గంటలకు విశాఖ పట్నం ఆకాశం లో విమానాలు ఎగురుతూ వచ్చాయి. మేమంతా వరండాలోకి వెళ్లి చూసాం .
తెలియని వాళ్ళు , వాళ్లకి సహజం గా ఉండే ధీమాతో "మనవాళ్ళ వే " అని భరోసా ఇచ్చారు.
అది తప్పని మధ్యాహ్నం అవి రెండో సారి వచ్చినప్పుడు తేలిపోయింది . సైరెన్ లు భయం వేసేలాగా మోతలు పెట్టడం మొదలయింది .
నర్సులు వచ్చి " మంచాల కింద దాక్కొండి " అంటూ ఆ పొడుగాటి సాధారణ వార్డ్ లో తిరుగు తూ అందరికి చెప్పారు. చెవుల్లో పెట్టుకోదానిక్ దూది ఇచ్చారు. ఇలా దాక్కున్నామో లేదో "భం భం " అని బాంబులు పడ్డాయి.
బాంబులు ‘భం భం " అని పడటం రైళ్లు ‘ మొయ్ మొయ్’ అంటూ మోతలు పెడుతూ రావటం నాకు మాటలు వచ్చాక నేను ఆశువుగా చెప్పిన నా కవితా ధోరణులు ట .నాకు 3 ఏళ్ల దాకా మాటలు రాలేదుట కాని వచ్చాక , రాగానే పరిమళించాయిట. మా అమ్మ , అందరు అమ్మలు వాళ్ళ పిల్లల విషయం లో ఎదో ‘ ఊడ పోడి చేస్తారని ఊహించి నట్టే , ఆశ పడినట్టే , నేను ఓ పెద్ద కవిని లేక పోతే తండ్రి లాగ పెద్ద మేస్ట ర్ని అవుతానని అనుకునేది ఆవిడా పోయేవరకు . ఆవిడ పోక ముందు ,పోయాక కుడా నేను చిన్న రచయిత ఒక చిన్న మేస్టరినే .
ఏమైతేనేమి ఆ బాంబులు వేసిన వాళ్ళు జపాన్ వాళ్ళుట . వాళ్ళ పుణ్యమా అని నా ఆపరేషన్ ఆగిపోయింది . నన్ను ఇంటికి పంపించేసారు. అంతే కాదు మా నాన్న గారు కి జీతం ఇస్తున్న ఆంధ్రా యూని వర్సిటి ని గుంటూరు తోలేయ్యటానికి నిర్ణయం అయిపోయింది .
మావాళ్ళకి విశాఖ పట్నం వదిలేసే ముందు సింహాచల అప్పల వరాహ లక్ష్మి నరసింహ స్వామి వరప్రసాదమైన నాకు అక్కడే పుట్టు వెంట్రుకలు తీయించటం విషయం లో వల్లీ దేవుడికిచ్చిన వాగ్దానం గుర్తుకు వచ్చింది. పొడుగు జుట్టు తో ఉన్న నాకు చుంచు దు వ్వి పింఛం పెట్టి మా అమ్మ బాలకృష్ణుడి గా అలంకరించేది మా అమ్మ . నా మేని రంగు దానికి సహకరించేది . అటువంటి నా జుట్టు ఇవ్వక పోతే ఆ అప్పన్న కొంప ఎమన్నా మునుగుతుందా . నా మాట వినే అలవాటు మా ఇంట్లో ఎవరికీ లేదు పైగా నాకు ఇంకా మాటలు రావు. బలవంతం గా జట్కా బండిలో తీసుకువెళ్ళి గుండు కొట్టించి నా తల ని చామ దుంప ఆకారం లోకి తెచ్చేసారు ఆ రోజుల్లో నాకు అభిప్రాయలు చెప్పటం రాదు . కాని వచ్చి ఉంటె " పోరా ! ననీబోడి అభిప్రాయాలూ నువ్వూ" అని ఖచ్చితంగా అనే వారు అని ఓ పుష్కరం అయ్యాక బుడుగు చెప్పాడు .
మా నాన్న గారు ,తను విశాఖ పట్నం లోనే ఉండిపోయి మమ్మలిని మా క్షేమం కోసం బందరు పంపించారు. బందరు ఒకప్పుడు చెన్న పట్నం కంటే ముఖ్యమైన పట్నం ట . అందుకే అక్క డ , ఆంగ్లే యులు పరాసు వారు ,బుడతకకీచులు , హళిందులు కొట్టుకు చచ్చరుట ఒకప్పుడు. కాని " ఇక్కడ చౌడు బంక పురుగులు తప్ప ఇంకేమున్నాయి ?" అనేది మా అమ్మ . లేకే మి ఉన్నాయి హల్వా, లడ్డూ లాంటివి చాల ఉన్నాయి. నాకు మాటలు రావు కదా అందుకని చెప్పటం విలు కాలేదు.
ఇంతకు ఆ మహా పట్నం మిద అంటే మచిలీపట్టణం మిద బాంబులు జపాన్ వాళ్ళు బాంబులు వెయ్యవచ్చునని నమ్మి అక్కడికి 10 మైళ్ళ దూరం లో ఉన్న రామన్న పేట అనే పల్లెలో ఉన్న మా మేనత్త గారి ఇంటికి మేము వెళ్ళిపోయాము. జపాన్ వాళ్ళు అటువంటి ఊ ళ్ళ మీద బాంబులు వేసే అంతటి వెర్ర వాళ్ళు కాదు అని మా మేన మావ , మాతో మేల మాడేవాడు . ఆ తరవాత ఎప్పుడైనా . రాజమండ్రి వాళ్లకి తెలియక పోవచ్చు కాని బందరు ఒక గొప్ప రేవు ఒకప్పుడు .
అది వేసం కాలమేమో నాకు వంటి నిండా సెగ్గడ్డలు వేసాయి వాటి మీద మా ఆమ్మ ఎర్రమన్ను పూసేది . వంటి మిడ్ గుడ్డలు లేకుండా తిరగటం నాకు గుర్తున్న దృశ్యాల్లో ఒకటి. అక్కడ వరండాలో మా పెద్దనాన్న గారు మంచం మిద పడుక్కుని ఉన్న దృశ్యం ఇప్పటికి నా కళ్ళకి కట్టినట్టు గుర్తు ఉంది
యుద్ద మేఘాలు విచ్చి వాన మేఘాలు కమ్ముకు రావటం తో శ్రావణ మాసం ముందరే మేము రామన్న పేట నుంచి బందరు వెళ్ళిపోయాము అయితే అవి సహాయ నిరాకరణ దినాలు అని ఇప్పుడు నాకు తెలుసు. . తెనాలి లో పట్టాలు పీకి నప్పుడే మా పెద్ద నాన్న గారు పోయారు . మా పెద్ద నాన్నగారి పెద్ద కొడుకు సూరి , కర్మ చేయటానికి తెల్ల బట్ట కట్టుకుని ఇప్పటికి నా కళ్ళ ముందు నిల బడుతునే ఉంటాడు. అల్లా కనపడినప్పుదాల్ల నాకు దుఃఖం ముంచుకొస్తుంది ఇప్పటికి .
అందుకే నాకు 1942 నాకు నచ్చని సంవత్సరం .
నాకు జరిగిన మంచి ఆ సంవత్సరం లో ఏమైనా ఉంటె అది నా ఆపరేషన్ ఆగి పోవటం , చల్లపల్లెలో విజయలక్ష్మి పండిట్ నండూరి వారింట పుట్టడం .
నేతాజీ సుభాస్ చంద్ర బోస్ " ధిల్లీ చలో" పిలుపునిచ్చినప్పుడే , మా నాన్నగారికి " గుంటూరు చలో " ఆదేశాలు వచ్చాయి .

Written by kavanasarma

August 24, 2017 at 3:07 am

Posted in Uncategorized

%d bloggers like this: